Tuesday, 26 December 2017

యువ వికాసానికి కౌసల్‌ పంజీ యాప్‌


నైపుణ్యం.. ఉద్యోగం

యువ వికాసానికి కౌసల్‌ పంజీ యాప్‌
-------------------++-++-----------------+-++------

10 నుంచి డిగ్రీ పూర్తయిన  వారు నమోదు చేసుకోవచ్చు
దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోంది. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, పీజీ, ఇతర వృత్తి విద్యాకోర్సులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం వేలాది మంది యువత ఎదురు చూస్తున్నారు. చిన్న ఉద్యోగ ప్రకటన వెలువడినా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అనేక ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. నిరాశతో వెనుదిరుగుతున్నారు. డిగ్రీలు చదివాం ఇంతకంటే ఏం కావాలని యువత ప్రశ్నిస్తుండగా.. కాస్త నైపుణ్యం అంటున్నాయి        నియామక సంస్థలు.


గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతీయువకుల్లో నైపుణ్యం పెంచి ఉద్యోగం,  ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. అర్హతలు ఉన్నా చాలామంది చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నారు. కొందరికైతే ఆరు, ఏడునెలల వరకు జీతాల చెల్లింపులు ఉండటం లేదు. దీంతో నిరుద్యోగ యువత దేవుడా అంటూ నిరాశ, నిస్పృహల మధ్య జీవిస్తున్నారు. ఇలా చదువుకొని ఉద్యోగం రాక, స్వయం ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న యువతకు కేంద్ర ప్రభుత్వం ఆసరా కల్పిస్తోంది. ఇందుకు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ కౌసల్య యోజన కింద ‘కౌసల్‌ పంజీ’ అనే మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కౌసల్‌ పంజీ పేరిట ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేసుకుంటే మంచి భవిష్యత్తును అందిపుచ్చుకున్నట్లేనని అధికారులు చెబుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత జీవితంలో స్థిరపడాలంటే నైపుణ్యాల ఆవశ్యకత చాలా అవసరం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గత రెండున్నరేళ్ల నుంచి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన అమలుచేస్తోంది. జిల్లాలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీలు పూర్తిచేసిన వారికి నెల, మూడునెలల ఇలా ఆయా కోర్సులకు అనుగుణంగా శిక్షణ ఇస్తూ భోజనం, వసతి సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తున్నారు. దిగ్విజయంగా పూర్తి చేసిన వారికి వివిధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా మరో వినూత్న కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్తగా యాప్‌, వెబ్‌ పోర్టరును తయారు చేసింది.
ఇలా నమోదుచేసుకోవాలి

గూగుల్‌ ప్లేస్టోర్‌లో కౌసల్‌ పంజీ యాప్‌ను మొదట స్మార్ట్‌ఫోన్‌లోకి దిగుమతి చేసుకోవాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి.ఆధార్‌, రేషన్‌కార్డు వివరాలతో పాటు విద్యార్హతలు, నివసిస్తున్న ప్రాంతం, ఆసక్తి ఉన్న రంగం, ఉద్యోగం కావాలా.. స్వయం ఉపాధి యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన శిక్షణ ఇచ్చి రుణం పొందే సౌలభ్యం కావాలా అనేది తెలపాలి. ఉద్యోగ అవకాశాలు పొందాలనుకునే వారికి అర్హత మేరకు అవకాశం ఉంటుంది. స్వయం ఉపాధి కోసమైతే యూనిట్లను నెలకొల్పడానికి అవసరమైన శిక్షణ ఇచ్చి రుణాలు మంజూరుకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సాయం చేస్తుంది. యాప్‌లో దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక వారికి ఐడీ నంబరు కేటాయిస్తారు. కౌసల్‌ పంజీ యాప్‌ గురించి జిల్లాలో డీఆర్‌డీఏ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రాలలో సదస్సులు నిర్వహిస్తున్నారు.

యువత  సద్వినియోగం చేసుకోవాలి
దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన ద్వారా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణలో ప్రయోజనం పొందేందుకు కౌసల్‌ పంజీ యాప్‌ను కేంద్రం విడుదల చేసింది. నిరుద్యోగ యువత వివరాలు నమోదు చేసుకుంటే వారి వివరాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ఆయా కంపెనీలకు తెలిపి అవకాశాలు కల్పిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు 28,569 మంది నమోదు చేసుకున్నారు. ఈనెలాఖరులోపు 50వేల మంది నమోదు చేసుకునేలా అన్ని చోట్లా అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలోని నిరుద్యోగ యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలి

No comments:

Post a Comment