Thursday, 23 November 2017

భవితకు బాట బిగ్ డేటా


యాదగిరికి రెండు ఎకరాల చేను అదిలాబాద్ లో ఉంది. వేరుశనగ పంట వేశాడు. కానీ సకాలంలో వర్షాలు పడలేదు. విత్తులు మొలకెత్తలేదు. పెట్టిన పెట్టుబడి అంతా దండగైపోయింది. అయితే యాదగిరి పురుగు మందులు తాగలేదు. తన సెల్ ఫోన్ లో బాంక్ ఎక్కౌంట్ చూసుకున్నాడు. అప్పటికే పంటల భీమా సంస్థ నుంచీ అతడికి నష్టపరిహారం అతని ఖాతాలో జమ అయిపోయింది. వెంటనే ఆ డబ్బుతో మరో పంటకు సిద్ధం అయ్యాడు. ఇది కలలో కాదు. నిజమే. బిగ్ డేటా ఎనాలిసిస్ తో రేపు రాబోయే వింత డిజిటల్ ప్రపంచం ఇదే.


పంటల రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కేవలం తన సెల్ ఫోన్ లో బ్యాంకు యాప్ డౌన్ లోడ్ చేసుకుని దాన్ని పూర్తి చేస్తే చాలు. గంట సేపట్లో అతని బ్యాంకు ఎక్కౌంటులో డబ్బు జమ అయిపోతుంది. వినడానికి కొంచెం ఆశ్యర్యంగా ఉన్నా రేపటి డిజిటల్ ముఖ చిత్రం ఇదే.

దీని గురించి అర్థం చేసుకుంటే ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలు చాలా చిన్నవి. కానీ ఇది సాధించాలంటే భారత దేశం ముందు అతిపెద్ద సవాల్ ఉంది. అది ఏమిటో తెలియాలంటే ముందుగా ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలు అర్థం చేసుకోవాలి.
వాతావరణ శాఖ తన దోవన అది పనిచేస్తోంది.
వ్యవసాయ శాఖ తన తీరున అది పనిచేస్తోంది.
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మాఫియా బలంతో పనిచేస్తోంది.
బ్యాంకింగ్ రంగం ఒత్తిళ్ళతో పనిచేస్తోంది
వ్యవసాయ భీమా కంపెనీ గాలిలో దీపంలా పనిచేస్తోది.

ఈ అనిశ్చితి అస్థిరత తొలగాలంటే కచ్ఛితమైన అంచనాలతో సవ్యంగా, సజావుగా పనిచేయాలంటే బిగ్‌డేటా ఎనలిటిక్స్ కావాలి. ప్రపంచం మిసైల్ వేగంతో బిగ్ డేటా ఎనలిటిక్స్ వైపు పరుగులు తీస్తోంది. దేశ, ఆర్థిక, వ్యవసాయ, వాణిజ్య రంగాల లావాదేవీల్లో సమూల మార్పులు రావాలంటే బిగ్‌డేటా ఎనలటిక్స్ గురించి తెలియాలి. ఈ నూతన వ్యవస్థకు అతి ముఖ్యమైంది ఇంటర్ నెట్ ఆఫ్ ధింగ్స్ ( IOT). వాహనాలు, గృహోపకరణాలు, సెన్సార్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో వివిధ సాఫ్ట్‌వేర్లను అనుసంధానం చేసిన ఇంటర్నెట్ ఇది. వీటి నుంచీ అపారమైన డేటాను సేకరించి విశ్లేషిస్తారు. ఉదా: పొలాల్లో, కొండల్లో, మైదానాల్లో, సముద్రాల మీద కొన్ని రకాల ఎలక్ట్రానిక్ రిసీవర్స్‌ను ఉంచుతారు. వీటి ద్వారా ఆ ప్రదేశంలో ఎంత ఎండ కాసింది? ఉష్ణోగ్రత ఎంత ఉంది? ఎంత వర్షం పడింది? వంటి వివరాలు సేకరిస్తారు.

ఈ వాతావరణ శాఖకు అంతరిక్షపరిశోధనా సంస్థతో అనుబంధం ఉంటుంది. ఆకాశంలోని ఉపగ్రహాల ద్వారా ప్రతీ ప్రాంతంలో పండుతున్న పంటలు, వాటి స్థితి గతుల డేటాను అవి పంపుతుంటాయి. రాబోయే తుఫానులు, వర్షాలు, కరువులు కాటకాలతో పాటు భూగర్భ జలాల అందుబాటు వివరాలు, జలాలు మోటార్లు పెట్టి ఏ ప్రాంతంలో ఎంత తోడారు అనే వివరాలు తెలుసుకుంటుంది. ఇలా అందివచ్చిన డేటాను విశ్లేషించి మండల స్థాయి నుంచి రాష్ట్ర, దేశ స్థాయిలో ఏ పంటలు ఎన్ని హెక్టార్లలో ఉంది ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందో తెలుసుకోవచ్చు. ఏ పంటలు ఎన్ని క్వింటాళ్ళు వస్తాయో తెలుస్తుంది కనుక వాటికి ధరలు ఎంత అనేది కూడా కచ్చితంగా నిర్ణయించవచ్చు. ఇది ఒక ఎత్తు అయితే ఈ సమాచారాలు బ్యాంకులకు, పంటల భీమా సంస్థలకు అనుసంధానం చేస్తారు.

దీంతో వారికి ముందస్తు సమాచారాలు వెళతాయి. ప్రకృతి బీభత్సాలు, చీడపీడలవల్ల కలిగే పంటనష్టాలను శాస్త్రీయంగా అంచనావేసి పరిహారాలు సజావుగా నిర్థారించగలుగతారు. పంటల బీమా మొత్తాలు, రుణాలు సకాలంలో ఇవ్వగలుగుతారు. మనకు అర్థమయ్యేభాషలో చెడితే ఇదీ బిగ్ ఎనలిటిక్స్ విశ్వరూపం. దీన్ని విదేశాలు ఎంత నిపుణంగా ఉపయోగించుకుంటున్నాయి. నష్టాలు తగ్గించుకుంటున్నాయి. ప్రకృతీ వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడుకుంటున్నాయి. ఆస్తినష్టాన్ని అడ్డుకోలేకపోయినా, ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలుగుతున్నాయి. కాగా మన దేశంలో ఈ విజ్ఞాన్ని వినియోగించడం అంతతేలిక కాదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మన దేశంలో ల్యాండు రికార్డులు ఏవీ నమ్మదగినవి కావు. ఎవరి పేరు మీద ఏ భూమి ఉందో తెలుసుకోవడం తేలికైన అంశం కాదు. రైతుపట్టాదారు పుస్తకాల పంపిణీలోనే అనేక అవకతవకలు జరుగుతున్నాయి. దీనికి తోడు బినామీ పేర్లు భూముల స్వాహాలు. లంచాలు. పట్టాదారు పుస్తకాల జారీలో..రెవిన్యూ రికార్డుల్లో..భారీ అవకతవకలు.. ఈ అవరోధాలు.. అక్రమాల జిగ్‌జాగ్‌లో బందీ అయిన అసలుడేటాను కనిపెట్టి న్యాయం చేయడం అయ్యేపనికాదు కనుక ఇది మన దగ్గర వర్కవుట్ అయ్యే అవకాశాలు ఇప్పట్లో లేవు.

అన్ని దేశాలలాగే మన దేశంలోనూ సవ్యమైన పరిస్థితులు ఉంటే బిగ్‌ఎనాల్సిస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అదిలాబాద్ లోని ఒక గిరిజన తాండాలోని యాదగిరికి రెండు ఎకరాల చేను ఉంది. అది అతని పేరుమీదనే ఉన్నట్టు తెలంగాణ రెవిన్యూ శాఖ నెట్ వర్కులో రిజిస్ట్రార్ పట్టా ఉంది. యాదగిరి తన సెల్ ఫోన్ లో ఉన్న బ్యాంకు యాప్ ద్వారా ఒకే స్విచ్ నొక్కి అప్పు కోసం అప్లై చేశాడను కుందాం. అతని అభ్యర్థన సెల్ ఫోన్ యాప్ ద్వారా బ్యాంకుకు చేరుకుటుంది. అందులోని రుణాలు జారీచేసే అధికారి ఆ రైతు భూముల వివరాలు తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల నుంచీ తీసుకుని యాజమాన్య వివరాలు తెలుసుకుంటాడుపక్కాగా ఉన్నట్టు బిగ్ డేటా ఎనలిటిక్స్ ఓకే చేస్తుంది. అతనికి ఉన్న రెండు ఎకరాలకు ఎంత అప్పు ఇవ్వవచ్చో కూడా సదరు అధికారికి సూచిస్తుంది. అధికారి అప్పు మంజూరు చేసి యాదగిరి బ్యాంకు ఖాతాకు జమ చేస్తాడు. ఇదంతా కేవలం నిమిషాల వ్యవధిలో జరిగిపోతుంది. ఇది బిగ్ డేటా ఎనలిటిక్స్ మాహాత్మ్యం.

ఉదాహరణకు ఢిల్లీలో కాలుష్య సెన్సర్లు ఉంటాయి. ఇవి ప్రతీ నిర్ణీత వ్యవధిలోనూ శబ్దతరంగాలను, ధూళికణాలను, పెట్రోలు వ్యర్థపదార్థాల వివరాలు నమోదు చేస్తూ ఉంటాయి. ఏ ప్రాంతంలో అయినా కాలుష్యం పెరిగిపోతే ఆటోమాటిగ్గా ఆ ప్రాంతంలోని అధికారులను హెచ్చరించి పొల్యూషన్ కంట్రోలు చర్యలకు ఆజ్ఞలు జారీ చేస్తుంది. అధికారులు ఆ ప్రాంతంలో వ్యక్తిగతవాహనాలు నిషేధించడమో, దారి మళ్ళించడమో చేస్తారు. నిజానికి నేడు ఇటువంటి సెన్సర్లు స్థాపించడం కష్టం కాదు. కానీ వాటి నుంచీ వచ్చే డేటాను సేకరించి, విశ్లేషించి తీసుకోవాల్సిన నిర్ణయాలు సకాలంలో తీసుకోవడం కష్టమైన పని. దీన్ని చేయడానికి కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేస్తున్నారు.

ప్రపంచంలో ఇప్పటికే భారత ప్రభుత్వం దగ్గర లేని డేటా అగ్రరాజ్యాల దగ్గర ఉంది. వారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ డేటాను కొనుగోలు చేస్తున్నారు. వారు రేపు వీటిని విశ్లేషించి అనేక నిర్మాణాత్మక నిర్ణయాలు నిక్కచ్చిగా తీసుకోబోతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే మన దేశ రహస్యాలు మనకు తెలియకుండా మనమే డేటా రూపంలో వారికి ఇచ్చేస్తున్నాము.
–===

రేపటి ప్రపంచం మొత్తం సెన్సర్ల మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచబ్యాంకు వంటి ఐక్యరాజ్యసమితి అనుంగు సంస్థలు ఈ బిగ్ డేటా ఎనలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇవి రేపటి ప్రపంచపటాన్ని మార్చివేస్తాయి. ఏ దేశానికి ఏ రకమైన కరువు రాబోతోంది? ఎంత మంది ప్రాణప్రమాదాల్లో ఉండబోతున్నారు? ఏ రకమైన జబ్బులు రాబోతున్నాయో వంటి వివరాలు అది ముందుగా పసిగట్టబోతోంది. ఇదంతా కేవలం డేటా పెరాలిసిస్ నుంచి విముక్తి పొంది సాధించబోతోంది. ఏ దేశంలో ఎంత మంది పిల్లలు పుట్టబోతున్నారు. బాలింతల, బాలబాలికల ఆహార, ఆరోగ్యవివరాలు, వేక్సిన్ల అవసరాలు కూడా కచ్చితంగా అంచనా వేస్తాయి.

ఎవ్వరూ ఊహించలేని విధంగా బిగ్ డేటా ఎనలిటిక్స్ ప్రపంచ వాణిజ్యరంగాన్ని ప్రభావం చేయబోతోంది. ఇది తెలియాలంటే అమెరికాలోని ఒక మద్యం అమ్మకం కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఈ కంపెనీ ఇప్పటికే తన బీరు వినియోగదారుల డేటాలు సేకరించి తన పోటీ బీరుతయారుదారులను దెబ్బకొట్టబోతోంది. తన బీరు రంగు రుచి వాసన దగ్గర నుంచీ వినియోగదారుల ఇష్టానిష్టాల వరకూ మాత్రమే ఇది కచ్చితం తెలుసుకోవడం లేదు. వారు ఎన్ని గుటకల్లో బాటిల్ ఖాళీచేస్తున్నారో కూడా తెలుసుకుంటోంది. ఏ పార్టీలో ఎంత మంది ఏరకమైన బాటిల్స్ ఎన్ని లాగిస్తున్నారో అంచనాలు వేసి తన ఉత్పత్తి విభాగానికి చెబుతోంది. దీంతో వారు ఒక బాటిల్ ఎక్కువ తక్కువ లేకుండా సరిగ్గా ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు, దీని కోసం అది సంప్రదాయ వ్యాపార ప్రకటనలపై ఆధారపడడంలేదు. సెల్ ఫోన్ యాప్‌లను ప్రోత్సహించి బీరు వాడకం దారులతో నేరుగా సంబంధాలు పెంచుకుంటోంది.

వారికి రకరకాల ఎరలు వేసి డేటాలు సేకరిస్తోంది. ఉదాహరణకు డిస్కౌంటు కూపన్లు, కాష్ బ్యాకుల ఆఫరు చేసి డైరెక్టు మార్కెటింగు చేసుకుంటోంది. వృథాగా టివీలో ఒక వ్యాపార ప్రకటన ఇవ్వడం కన్నా వంద మంది మందుబాబుల సెల్ ఫోన్లలో యాప్ గా మారడానికి ఇష్టపడుతోంది. ఈ డేటాల ఆధారంగా ఎంత కావాలో అంతే బీరు కేన్ల ఉత్పత్తి చేసి గోడౌన్లలో నిలువ ఉంచాల్సిన అవసరం లేకుండా చేసుకుంటోంది. అంతేకాక ఏ రకమైన బీరు ఎంత ఉత్పత్తి చేయాలో తెలుసుకుంటోంది. ఏ బీరుకు ఏ విధమైన రంగు రూపు రుచి మార్పులు చేయాలో తెలుసుకుంటోంది. ఈ బీర్ల తయారీ సంస్థ అక్కడితో ఆగట్లేదు.. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలతో సంబంధాలు పెట్టుకొని డేటాను పొందుతోంది. అందులో వస్తున్న కామెంట్లు సశాస్త్రీయంగా విశ్లేషిస్తూ బీరు ఉత్పత్తి రంగాన్ని కబ్జా చేయబోతోంది. ఎవ్వరూ ఊహించలేని విధంగా తన బీరు కేన్లు, బాటిల్స్ రూపకల్పన చేయబోతోంది. ఇవి ఎల్‌ఇడి లైట్ల వెలుగుకు అనుకూలంగా స్పందిస్తాయి. మ్యూజిక్ కు అనుగుణంగా స్పందిస్తాయి. నోటి దగ్గరకు వచ్చే ప్రతీసారి బాటిల్స్ మెరుస్తాయి. ప్రతీ సీసా పార్టీలో అంతర్భాగమై చీర్లు కొట్టే దగ్గర నుంచీ గుడ్ నైట్ వరకూ శాసించాలని- కొత్తరకాల డిజైన్లు చేస్తోంది. దీనికి బిగ్ డేటా ఎనలిటిక్స్ సహాయం తీసుకోబోతోంది. ఈ విధంగా ప్రపంచం లెక్కప్రకారం అడుగులువేస్తూ ముందుకు సాగబోతోంది.

అంతర్జాతీయ కంపెనీలు వినియోగదారులకు తెలియకుండా పెద్దపెద్ద మాల్స్ నుంచి అనేక డేటాలు సేకరిస్తాయి. ఒక షెల్ఫ్ లో ఉన్న వస్తువును ఎంత మంది చూశారు? ఎంత మంది తాకుతారు? ఎంత మంది లేబుల్స్ పరిశీలిస్తారు? ఎంత మంది శాంపిల్ వినియోగించడానికి ఇష్టపడతారు? ఏ విధమైన కామెంట్లు చేస్తారు? ఎంత మంది కొంటారు? ఎంతమంది రెండోసారి కొంటారు? ఎంత మంది బ్రాండ్ ఎడిక్ట్ అవుతారు? అనే వివరాలు చాలా పకడ్బందీగా వివిధ సెన్సర్లు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సేకరించి వాటిని విశ్లేషించి తమ ఉత్పత్తుల రూపురేఖలు మార్చివేసి వినియోగదారులను బానిసలుచేసుకోబోతున్నారు. ఇంతేకాక సదరు బీరు కంపెనీలు ఫేస్ బుక్, గూగుల్ వంటి వాటి ద్వారా వ్యక్తిగత సమాచారాలు సేకరిస్తాయి. ఉదాహరణకు పుట్టిన రోజు సమాచారం సేకరించి మీ పుట్టిన రోజు పార్టీని మా బీరు కేన్లతో చేసుకోండి. మీకు 50శాతం డిస్కౌంటు ఇస్తాము అనే ప్రమోషన్లు చేసే రోజులు ముందున్నాయి. రకరకాలుగా మారిపోయే ఈ మార్కెటింగ్ ప్రమోషన్లు ఏ రోజున ఎలా ఉంటాయో ఊహించడం కూడా కష్టమే. కంపెనీలు వినియోగదారులను బానిసలు మార్చేసుకుని పోటీదారులను తొక్కి పారేస్తాయి.

కేవలం బీర్ల కంపెనీలే ఈ విధంగా డేటా ఎనలిటిక్స్ పై దృష్టిపెడితే ఇక నేరపరిశోధనా, నియంత్రణాధికారులు ఏ రేంజ్ లో ఉపయోగిస్తారో ఆలోచించండి. ఇది తెలియాలంటే చైనా వెళ్ళాలి. చైనా పోలీసులు పటిష్టమైన పోలీసు క్లౌడ్ తయారు చేస్తున్నారు. ఎక్కడ నేరం జరిగే అవకాశం ఉందో పసికట్టి పోలీసు మేఘం ముందుగా అక్కడ గూడు కట్టుకుంటుంది.. దీని కోసం వీరు అనేక రకాలైన సమాచారాలు సేకరించి బిగ్ డేటా ఎనలిటిక్స్ ద్వారా విశ్లేషిస్తారు. ఎవరి ఖాతాలోకైనా అసాధారణ మొత్తంలో డబ్బులు రావడం, ఖర్చులు పెరగడం, కొనగూడని పదార్థాలు కొనడం, వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళడం.. నేరాలలో ఉపయోగించే వస్తువులు ఒక్కొక్కటిగా సేకరిస్తూ ఉండడం వంటివి గమనిస్తూ ముందస్తు నిఘాలు పెట్టి నేరాలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

పోలీసు వ్యవస్థలో బిగ్ డేటా ఎనలిటిక్స్‌ను చైనా ఇప్పటికే ప్రారంభించే సింది. అపారమైన క్రైం డేటాలు విశ్లే షించడానికి కృత్రిమ మేధతో రంగంలోకి దిగిపోయింది. చైనాతో పాటు అగ్ర రాజ్యాలు రోడ్లపై కెమేరాలతో పాటు సెన్సార్లు పెట్టి రాష్ డ్రైవింగ్ లను ని యంత్రించబోతున్నాయి. హత్య, దోపిడీలు చేసి వాహనాలలో పారిపోయే వీ లు లేకుండా ట్రాఫిక్ కెమేరాలకు డేగకళ్ళు పెట్టనున్నాయి. నేరం తరువాత పరిశోధన ఈనాటి పోలీసు నీతి. కానీ రేపటి పోలీసింగ్ లక్షం ఇదికా దు..నేరం జరగకుండా చూడడం! ఒకవేళ నేరం జరిగితే రియల్ టైంలో స్పందించి నేరగాళ్ళ చేతులకు అంటిన రక్తం గడ్డకట్టేలోపల బంధించడం. అగ్ర రాజ్యాలలో పోలీసు వ్యవస్థలు దీనిపైనే ఆధారపడి రూపుదిద్దుకోబోతున్నా యి. ఇవన్నీ బాగేనే ఉన్నాయి కానీ విద్యా ఉపాధి అవకాశాలు ఎలా ఉండ బోతున్నాయి? ఏ రంగంలో ఉండబోతున్నాయి అన్నవే కదా మీ ప్రశ్నలు.
ఈ అధునాతన వ్యవస్థలో ప్రధానమైన వృత్తులు రెండే.
ఒకరు డేటా ఇచ్చేవారు.
మరొకరు విశ్లేషకులు.

ఈ రెండు వర్గాలుగా ఐటి విడిపోబోతోంది. డేటా ఇచ్చే రంగంలో ఎక్కువగా మానవులు కన్నా యాంత్రిక పరికరాలే ఉంటాయి. ఉదా: సెన్సార్లు, కెమేరాలు, బార్ కోడ్ రీడర్లు, సెల్ ఫోన్లు, కార్లు -వగైరాలు.
ఎవరు ఏం చదివారు అన్నది కాదు ప్రధానం. ఆ రంగానికి చెందిన డేటాను ఎలా సేకరిస్తారు అనే దానిపైనే ఆ రంగాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వ్యవసాయంలో డిగ్రీ చేసిన వారైనా తమ రంగంలో పంటలు, చీడలు, పీడలు వంటి వివరాలు సేకరించడానికి ఉపయోగపడతారు.

వీరు పంపే డేటాను విశ్లేషించడానికి కృత్రిమ మేధస్సు ఉపయోగిస్తారు. దీనికి ముందుగా డేటాను సేకరించడం, స్టోర్ చేయడం, యాక్సెస్ చేయడం. ప్రాసెస్ చేయడం. విశ్లేషించడం వంటి విభాగాలు ఉంటాయి. ఈ రంగాల్లో పెను మార్పులతో ఉపాధి అవకాశాలు రానున్నాయి. అన్నిటికీ మించి కేవలం డేటా మాత్రమే డబ్బుగా మారిపోతుంది. ఎవరు డేటా సేకరించగలిగితే వారే విజేతలు అవుతారు. ఎంత తాజా డేటా అయితే అంతగా విజయం వరిస్తుంది. ఇప్పుడు మనం సెల్ ఫోన్ తో నియంత్రించే ఏసీలు, టీవీలు, ప్రిజ్జులకు పరిచయం అవుతున్నాము. రేపు ఇవే మనకు తెలియకుండా మన డేటాలు ఇతరులకు చేరవేస్తాయి. కేవలం ఒక ఏడాది లోపల మన సెల్ ఫోన్లు కృత్రిమ మేధస్సుతో అనుసంధానం కాబోతున్నాయి. మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ పురులు విప్పబోతోంది. రేపు డేటా సైంటిస్టులుగా కొత్త ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. యూజర్ ఎక్సపీరియన్స్ డిజైనర్లు, యూజర్ ఇంటర్ ఫేస్ డిజైనర్లు అనే వృత్తులు రాబోతున్నాయి. కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ డెవలపర్లు, క్లౌడ్ ఇంజనీర్లు అనే శాఖలు కొత్తగా రాబోతున్నాయి. వీటికి తోడు గా ఇప్పటి వరకూ వస్తున్న టెక్స్టు, చిత్రాలు, వీడియోలు, శబ్దాలు డేటాలతో పాటు ఇంటర్ నెట్ ఆఫ్ ధింగ్స్ డేటాలు సేకరించడం వృత్తిగా మారుతుంది. క్రమరహిత డేటాను క్రమబద్ధం చేయడానికి మనుషులు అవసరం అవుతారు. నేడు సృష్టించే డేటా మేఘాలే రేపటి విజయానికి కారణాలు అవుతాయి. కనుక క్లౌడ్ కంప్యూటింగ్ అగ్రస్థానం పొందుతుంది. ప్రతీ వ్యాపార సంస్థ చాట్ బాట్స్ ( chatbots) అభివృద్ధి చేసుకుంటుంది

No comments:

Post a Comment