Thursday, 21 July 2016

గెలుపు మీ లక్ష్యమైతే!


పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారందరి కోరికా ఒక్కటే.. ఉద్యోగ సాధన లేదా ఉన్నత విద్య. అయితే ఈ ఒక్క కోరిక మాత్రమే ఉంటే సరిపోదు. అది లక్ష్యంగా మారాలి.. లక్ష్యం దృఢ సంకల్పంగా స్థిరపడాలి.. చివరికి ఆశయం సిద్ధిస్తుంది. ఈ ప్రక్రియలో ప్రతిఒక్కరూ ఏం చేయాలి? ఆ క్రమమేమిటో తెలుసుకోండి. విజయీభవ!

'ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి..' - మంచి ఫలితాలు సాధించాలనుకునే విద్యార్థులకు సాధారణంగా చెప్పే మొదటి సూచన ఇది. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్న ఎంతో మంది తమ శక్తిసామర్థ్యాలకు ఎన్నో రెట్లున్న విజయాలను సాధించిన ఉదాహరణలు మనకు తెలుసు. ఒక 'బిలో యావరేజి' న్యాయవాదిగా ఉన్న మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.. మహాత్మగాంధీగా మారడానికి, రామేశ్వరంలో నిరుపేద పడవ నడిపే వ్యక్తి కొడుకు అబ్దుల్ కలాం.. ఇండియన్ మిస్సైల్ మ్యాన్‌గా మారడానికి వారు ఎంచుకున్న ఉన్నత లక్ష్యాలే కారణం. అయితే ఉన్నతవిద్యలో సీటు సాధించడానికో, ఉద్యోగం సంపాదించడానికో పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్న విద్యార్థులకు 'ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి!' అనే మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఐఐటీలో సీటు సాధించాలనో, గ్రూప్-2 అధికారిగా ఉద్యోగం సంపాదించాలనో ఏదో ఒక లక్ష్యంతోనే వారు పరీక్షలు రాయడానికి సన్నద్ధమవుతున్నారు కదా! మరి పోటీ పరీక్షలకు సిద్ధమై.. రాసిన విద్యార్థులంతా ఎందుకు రాణించడం లేదు? తమ కోటాలో ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా ఒకటి, రెండు మార్కులతో సీట్లు, ఉద్యోగాలు పోగొట్టుకున్నవారిని సంగతి అలా ఉంచండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో చాలామంది కనీస స్థాయి ప్రతిభను చూపడం లేదన్నది ఫలితాల సరళిని పరిశీలిస్తే తెలుస్తుంది.
పోటీ పరీక్షల్లో తక్కువస్థాయి సామర్థ్యం చూపించే విద్యార్థులకు, విజేతలుగా నిలిచే వారికీ మధ్య తేడాను వారు పరీక్షకు సన్నద్ధమయ్యే విధానాలను గమనిస్తే తెలుస్తుంది. క్రమశిక్షణ, అంకితభావం, తెలివితేటలు, నైపుణ్యాలు లాంటి అంశాల్లో ఉన్న తేడాలతో పాటు, విజేతలకు తమ లక్ష్యం మీద చాలా స్పష్టత ఉండటమనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని చాలామంది గ్రహించరు.. అంగీకరించరు.. ఎందుకంటే పైన చెప్పినట్లు 'నేను ర్యాంకు తెచ్చుకోవాలి.. లేదా ఉద్యోగం తెచ్చుకోవాలి అనే లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది'. అని బల్లగుద్ది మరీ చెబుతారు. మరి తేడా ఎక్కడుంది? ఒక్కసారి చూద్దాం.

ఏది లక్ష్యం?
కోరిక వేరు.. లక్ష్యం వేరు. ఒక కోరిక లక్ష్యంగా మారాలంటే అంతకుముందు మానసికంగా అది ఎన్నో మెట్లెక్కాలి. అవేమిటో చూద్దాం (చిత్రం పరిశీలించండి).
'ఐ వోంట్ డూ ఇట్' - I won`t do it - (నేను దాన్ని చేయను / నేను గ్రూప్ పరీక్షలు రాయను) అనేది 'అందని ద్రాక్ష పుల్లన' అనే ప్రతికూల దశ.
'ఐ కాంట్ డూ ఇట్' - I can`t do it —(నేను చేయలేను / నేను గ్రూప్ పరీక్షలు రాయలేను) అనే దశలో కనబరచిన నిజాయతీ వల్ల ప్రతికూలత తగ్గి విజయంవైపు ఒక మెట్టు ఎక్కామన్న మాట.
'ఐ వాంట్ టూ డూ ఇట్' - I want to do it — (నేను చేయాలనుకుంటున్నాను / నేను గ్రూప్ పరీక్షలు రాయాలనుకుంటున్నాను) అనే దశలో బలహీనమైన కోరిక మాత్రమే ఉంది.
'హౌ డూ ఐ డూ ఇట్?' - How do I do it? — (నేను దీన్ని ఎలా చేయాలి? / నేను గ్రూప్ పరీక్షలు ఎలా రాయాలి?) అనే దశలో కోరిక తీర్చుకోవడం పట్ల మానసికమైన ప్రయత్నం మొదలైంది. ఇది నిజమైన తొలి అడుగు.
'ఐ విల్ ట్రై టూ డూ ఇట్' - I`ll try to do it — (నేను దీన్ని చేసేందుకు ప్రయత్నిస్తాను / నేను గ్రూప్ పరీక్షలు రాసేందుకు ప్రయత్నిస్తాను) అనే దశలో కోరిక తీర్చుకునే దిశలో రెండు అడుగు పడింది.
'ఐ కెన్ డూ ఇట్' - I can do it —(నేను దీన్ని చేయగలను / నేను గ్రూప్ పరీక్షల్లో విజయం సాధించగలను) అనే దశ ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించే దశ. ఇక్కడ మీ కోరిక లక్ష్యంగా మారడం ప్రారంభించింది.
'ఐ విల్ డూ ఇట్' - I will do it —(నేను దీన్ని చేస్తాను / నేను గ్రూప్ పరీక్షల్లో విజయం సాధిస్తాను) అనే దశలో కోరిక లక్ష్యంగా మారింది. 'నేను ఫలానా పని చేస్తాను' అని ప్రకటిస్తున్నామంటే.. దాన్ని ఎలా చేయాలో ఒక స్పష్టత వచ్చిందన్నమాట.
కోరిక పట్ల, దాన్ని సాధించే మార్గం పట్ల స్పష్టత ఏర్పడినప్పుడే ఒక కోరిక లక్ష్యంగా మారుతుంది. ఇవి మానసికమైన దశలు. వీటి గురించి తెలుసుకున్నాక ఆచరణాత్మక దశల గురించి తెలుసుకోవాలి. అవేమిటో పరిశీలిద్దాం.


సాధించగలిగే లక్ష్యం.. లక్షణాలు
సరళంగా చెప్పాలంటే రాత పూర్వకమైన కోరికలే లక్ష్యాలుగా మారతాయి. లక్ష్యాలను రాసుకోవడం మాత్రమే కాదు.. వాటిని స్పష్టంగా వర్ణించాలి. ఈ వర్ణన కింద చెప్పినట్లుగా 'స్మార్ట్ (SMART)'గా ఉండాలి.
అంటే Specific, Measurable, Achievable, Relavent, Timebound. ఇప్పుడో ఒక్కోదాని గురించి తెలుసుకుందాం.
Specific అంటే స్పష్టత. అంటే మనం నిర్దేశించుకున్న లక్ష్యం స్పష్టంగా ఉండాలి. 'నేను మంచి ర్యాంకు సంపాదించాలను కుంటున్నాను..' నేను గ్రూప్-1 ఉద్యోగం సాధించాలనుకుంటున్నాను అనేవి కోరికలు మాత్రమే. లక్ష్యాలు కావు. మరి స్పష్టమైన లక్ష్యం అంటే ఏమిటి?
'నేను 5000 లోపు ర్యాంకు తెచ్చుకుంటాను..' నేను సబ్ కలెక్టర్ / డీఎస్పీ ఉద్యోగం సంపాదిస్తాను అనేవి స్పష్టమైన లక్ష్యాలు.

Measurable అంటే కొలవదగింది. 'బాగా చదవాలి.. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి' అనేవి కొలవదగిన లక్ష్యాలు కాదు.
'రోజుకు 12 గంటలు చదవాలి.. 90 శాతం మార్కులు తెచ్చుకోవాలి' అనేవి కొలవదగిన లక్ష్యాలు.
Achievable అంటే అందుకోగలిగింది. లక్ష్యం మీరు సమీప భవిష్యత్తులో అందుకోగలిగేలా ఉండాలి. ఇప్పుడు పరీక్షల్లో 40 శాతం మార్కులు సంపాదిస్తుంటే.. వచ్చే నెలలో 'నెలకు 60 శాతం సంపాదించాలి' అనే లక్ష్యం పెట్టుకోవచ్చు. అంతేకానీ 'ఒకేసారి 80 శాతం మార్కులు సంపాదించాలి' అనే లక్ష్యం సాధించడం బహుశా అసాధ్యం.

Relavent అంటే తగింది. మనం నిర్దేశించుకుంటున్న లక్ష్యం మనకు తగిందిగా, అనుగుణమైందిగా, ఇష్టమైందిగా ఉండాలి. అంటే మన ఆసక్తులు, శక్తి సామర్ధ్యాలు, మన స్థాయి, మనకు అందుబాటులో ఉన్న సమయానికి తగిన విధంగా ఉండాలి. మీ చదువు, అందులో మీ విజ్ఞాన సామర్ధ్యానికి అనుగుణంగా మీ లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసినవారు వైద్య ఉద్యోగాలు సంపాదించలేరు కదా! మనకు ఏది సరిపోతుందో, మనం దేన్ని చేరుకోగలమో ఆ లక్ష్యానికి అనుగుణంగానే వ్యవహరించాలి. పరీక్షలో 90 శాతం మార్కులు సంపాదించాలనే లక్ష్యం ఉన్నప్పుడు.. రోజుకు 2 గంటలు వ్యాయామం చేయడానికి కేటాయించాలనుకోకూడదు. వెనుకబడి ఉన్న 2 సబ్జెక్టుల్లో ఒకేసారి ఎక్కువ మార్కులు సాధించాలనుకోవడం కూడా సరికాదు.

Time bound అంటే కాలపరిమితి. మనం నిర్దేశించుకున్న లక్ష్యానికి ఒక నిర్ణీత కాలపరిమితి ఉండాలి. అంటే ఒక వారంలో సాధించాలి.. ఒక నెలలో సాధించాలి.. ఇలా లక్ష్య ప్రస్తావనలో సమయం తప్పకుండా ఉండాలి. లక్ష్యాలు ఎప్పుడూ సానుకూలంగా ఉండాలి. సమయం వృథా చేయకూడదు అనే లక్ష్యం కంటే 'సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి' అనే లక్ష్యం మంచి ఫలితం ఇస్తుంది.


రకాలు
లక్ష్యాల్లో బహుముఖ లక్ష్యాలు, ఏకముఖ లక్ష్యాలు ఉంటాయి. జీఆర్ఈ, టోఫెల్ పరీక్షల్లో ర్యాంకు తెచ్చుకోవాలనే లక్ష్యం, సివిల్స్ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఒక లాంటివి కాదు. కొన్ని లక్ష్యాల సాధనకు మన శక్తియుక్తులను పరిమితమైన అంశాలపై కేంద్రీకరిస్తే సరిపోతుంది. మరికొన్ని లక్ష్యాల సాధనకు మనం కృషి చేయాల్సిన పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకునే యువకుడు రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లిష్‌తోపాటు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు కూడా సన్నద్ధం కావాలి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్ధులు తమ లక్ష్యాలు ఏకముఖమైనవా? బహుముఖమైనవో తెలుసుకోవాలి.
పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించడం అనే పెద్ద లక్ష్యాన్ని, విజయం సాధించడం కోసం చేయాల్సిన వివిధ పనులను చిన్నచిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలి. అలా విభజించుకున్న చిన్న లక్ష్యాలు పరిజ్ఞాన, నైపుణ్య, వ్యక్తిత్వ, వస్తు సంబంధమైనవిగా వర్గీకరించుకోవాలి.

ఆర్థికశాస్త్రం, రాజ్యాంగం, జీవశాస్త్రం, అంకగణితం లాంటి సబ్జెక్టులపై పట్టు సాధించడం పరిజ్ఞాన సంబంధమైన లక్ష్యాలు. లెక్కలు వేగంగా చేయడం, నోట్సు తయారు చేసుకోవడం, స్పెల్లింగు, గ్రామర్ తప్పులు లేకుండా రాయడం లాంటివి నైపుణ్య సంబంధమైనవి. బద్ధకం వదిలించుకోవడం, మొహమాటం తగ్గించుకోవడం, సినిమాలు, ఛాటింగులూ లాంటి బలహీనతలను జయించడం లాంటివి వ్యక్తిత్వ సంబంధమైన లక్ష్యాలు. ఈ చిన్న లక్ష్యాలన్నీ సాధిస్తేనే ఉద్యోగం సాధించడం అనే పెద్ద లక్ష్యం సాధించడం సాధ్యమవుతుంది. పెద్ద లక్ష్యం సాధనలో విఫలమైనా, చిన్న లక్ష్యాల సాధనకు చేసిన కృషి వృథా కాదు.

ఇలా వాటి లక్షణాల పరంగా లక్ష్యాలను వర్గీకరించుకున్న తర్వాత, వాటిని స్మార్ట్ గోల్స్‌గా మార్చుకోవాలి. సాధించాల్సిన గడువులను బట్టి లక్ష్యాలను దీర్ఘకాలిక లక్ష్యాలు, స్వల్పకాలిక లక్ష్యాలుగా విభజించుకోవాలి.

పోటీ పరీక్షకు మూడు నెలల సమయం ఉందనుకుంటే పరీక్షకు నాలుగు రోజుల ముందునాటికి సాధించాల్సిన లక్ష్యాలను దీర్ఘకాలిక లక్ష్యాలుగా భావించాలి. వారం వారం సాధించాల్సిన లక్ష్యాలు స్వల్పకాలిక లక్ష్యాలు. ఏ రోజుకు ఆరోజు పూర్తి చేయాల్సినవి తక్షణ లక్ష్యాలు.
లక్ష్య స్పష్టత

లక్ష్యానికి సంబంధించిన స్పష్టత రెండు రకాలు. కారు కొనాలనేది మీ లక్ష్యమైతే ఏ బ్రాండు కారు? ఏ మోడల్? ఏ వర్షన్? ఏ రంగు? కారు కొనాలనుకుంటున్నారో మీకు స్పష్టంగా తెలియాలనేది ఒక రకం స్పష్టత.

మీరు కొనాలనుకుంటున్న కారు ఖరీదు ఎంత? అవుటాఫ్ షోరూం ధర ఎంత? యాక్ససరీస్ ఎంత? ఆన్ రోడ్ ధర ఎంత? వాయిదాల పద్ధతిలో తీసుకుంటే కనీసం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? ఎన్ని వాయిదాలకు అవకాశం ఉంది? నెలసరి వాయిదా ఎంత? బ్యాంకు ఎంత లోన్ ఇస్తుంది? కంపెనీ ఫైనాన్సుకు, బ్యాంకు లోన్‌కూ తేడా ఏమిటి? అనే అంశాలు తెలుసుకోవడం రెండో రకం స్పష్టత.
దీన్ని పోటీ పరీక్షలకు కూడా వర్తింపజేసి చూడండి. మనకు ఏ ర్యాంకు వస్తే ఏ సీటు వస్తుందో, ఏ ఉద్యోగం వస్తుందో చాలామంది విద్యార్థులు చెప్పగలరు. కానీ ఎన్ని మార్కులు తెచ్చుకుంటే అంత ర్యాంకు వస్తుంది? అన్ని మార్కులు తెచ్చుకోవడానికి ఎన్ని రకాల అవకాశాలున్నాయనేది చెప్పగలిగే విద్యార్థులు తక్కువ. మీరు కూడా అలాంటి తక్కువ మంది లోకే వస్తే మీరు కోరుకున్న ర్యాంకు, ఉద్యోగం మీకు వస్తుందని చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.
లక్ష్య స్పష్టతకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేసుకోవడం, వాటికి సమాధానాలు రాసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అవి..

* లక్ష్యాలను సాధించడానికి ఏయే చర్యలు చేపట్టాలి?
* ఏయే వనరులు కావాలి?
* లక్ష్యాలను సాధించే క్రమంలో ఏవైనా ఆటంకాలు ఏర్పడతాయని అనుకుంటున్నారా?
* ఆటంకాలను ఎలా అధిగమించగలరు?
* లక్ష్యసాధనలో సహకారం అందించగల వారెవరు?


పొరపాట్లు
లక్ష్య స్పష్టతకు సంబంధించి వివరాలు సేకరించేటప్పుడే.. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం సేకరించేటప్పుడు అపోహలకు, వదంతులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. స్వయంగా ఆయా రంగాల్లో అనుభవం ఉన్నవారి నుంచే సలహా తీసుకోవాలి. పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు చేస్తున్న వారు సాధారణంగా కోచింగ్ సెంటర్ల దగ్గర ఉండరు కదా! కోచింగ్ సెంటర్ల దగ్గర సీనియర్లు అని చెప్పుకునేవారు చాలాసార్లు పోటీ పరీక్షలు రాసి విఫలమై ఉంటారు. వారు నిరాశాపూర్వకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది.
అలాగే చాలామంది అభ్యర్థులు పోటీ పరీక్షల గురించి సమాచారం సేకరించడంలోనే సమయమంతా గడిపేస్తారు. ఆ సమాచారాన్ని సద్వినియోగం చేయడం గురించి ఆచరణ మొదలెట్టరు. కనిపించిన సమాచారమంతా సేకరించుకుంటూ పోతే అది స్పష్టతకు దారితీయదు సరికదా! అమోమయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తుంది.

ఒక్క నిమిషం...
లక్ష్య స్పష్టత సాధించాక.. ఇంకా ఆచరణలోకి దిగేముందు మీ గోల్స్‌ను 'ఒన్ మినిట్ గోల్' పద్ధతిలో రాసుకోవడం లక్ష్యసాధనను సులభం చేస్తుంది. ప్రస్తుతం మీరు సాధించే లక్ష్యం మీ దీర్ఘకాలిక లక్ష్యానికి ఎలా ఉపయోగపడుతుంది? ఇది ర్యాంకు మెరుగు పరుచుకొనేందుకు, తద్వారా ఉద్యోగం సాధించేందుకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ అంశాలను ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో చదవగలిగేంత విషయంగా ఒకచోట రాసుకోవాలి. దాన్ని మీరు చదివే, సంచరించే ప్రదేశాల్లో ఎదురుగా కనిపించేలా పెట్టుకోవాలి. దానిమీదకు దృష్టి వెళ్లినప్పుడల్లా చదవాలి. అలా చేయడం వల్ల మీరు ఆ లక్ష్యాన్ని సాధించే అవకాశం చాలా రెట్లు పెరుగుతుంది.
ఊహల్లో విజయం

ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే.. రాత్రి పడుకునే ముందు మన లక్ష్యాన్ని సాధించినట్లు ఊహించుకోవడం (గోల్ విజువలైజేషన్) వల్ల మనలోని మానసిక శక్తులను లక్ష్యాన్ని సాధించే దిశగా కేంద్రీకరించేందుకు ఉపయోగపడుతుందన్నది మానసిక శాస్త్రవేత్తలు చెప్పే మాట. 'కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోండి' అనే అబ్దుల్ కలాం నినాదం అందరికీ తెలిసిందే. దాన్ని మన ప్రధాని నరేంద్రమోదీ మరింత ఆచరణీయంగా మార్చి చెప్పారు. 'ఏం కావాలో కలలు కనొద్దు. ఏం చేయాలో కలలు కనండి' అని మోదీ వివరించారు. అంటే 'గ్రూప్-2 పోస్టు సాధించినట్లు'కాకుండా.. 'గ్రూప్-2 పరీక్షలో 90 శాతం మార్కులు సాధించినట్లు' కలలు కనాలి.

దృఢ సంకల్పం (బర్నింగ్ డిజైర్)
సోక్రటీస్ - అతడి శిష్యుడి కథ తెలుసా? - విజయ రహస్యం ఏమిటని అడిగిన శిష్యుడిని సాయంత్రం నది వద్దకు రమ్మన్నాడు సోక్రటీస్. నదిలో తనతో కలిసి స్నానం చేయమని ఆహ్వానించాడు. స్నానం చేసే సమయంలో శిష్యుడిని పట్టుకుని బలంగా నీటిలో ముంచేశాడు. ఊపిరాడక గిజగిజలాడిన శిష్యుడు ఎంతో కష్టం మీద నీటి నుంచి బయటపడ్డాడు. అలా బయట పడిన తర్వాత సోక్రటీస్ శిష్యుడితో 'నీవు నీటిలో మునిగి ఉండగా గాలి కావాలని ఎంత బలంగా కోరుకున్నావో, విజయం సాధించాలని కూడా అంతే బలంగా కోరుకున్నప్పుడు నీకు విజయం కచ్చితంగా దక్కుతుంది' అని వివరించాడు.
అంటే లక్ష్యం పట్ల అంత బలమైన కోరిక పెంచుకోవడం తేలిక కాదు. కాబట్టి మీరు ఎందుకు లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారో, అలా సాధించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి ప్రగతి సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోవాలి. ఏదైనా కారణంతో లక్ష్యం సాధించలేకపోతే ఎంత నష్టపోతారో అంచనా వేసుకోవాలి. ఆ నష్టానికి, లక్ష్యసాధనలో పడాల్సిన కష్టానికి సిద్ధపడితే మీ భవిత కోసం, మీ కుటుంబ భవిత కోసం మీరు లక్ష్యసాధనలోకి దిగితే అప్పుడు ఆ లక్ష్యం ఆశయంగా మారుతుంది.No comments:

Post a Comment