Tuesday, 14 June 2016

For long time preperation of competitive examinations


పోటీలో మీరెక్కడ?
ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని, ఏదో చదివేసి, తోచింది రాసేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కానీ కొందరు అభ్యర్థులు ఎంతో కష్టపడి చదువుతారు; కానీ వారికి ఉద్యోగం అందరాని చందమామే అవుతుంటుంది. ఇలాంటివారు కొన్ని లోపాలను సరిదిద్దుకుని, మరికొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించగలిగితే విజేతల క్లబ్‌లోకి సగర్వంగా అడుగుపెట్టగలుగుతారు!
శ్రీనివాస్‌, నరేశ్‌ ఇద్దరూ మంచి మిత్రులు. డిగ్రీ పూర్తికాగానే ప్రభుత్వోద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరునూరైనా ఎప్పుడు నోటిఫికేషన్‌ వచ్చినా ఉద్యోగం కొట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. తండ్రుల వ్యాపకాల రీత్యా శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో ఉంటే నరేశ్‌ వరంగల్‌ వెళ్ళిపోయాడు. ఉద్యోగ ప్రకటన (నోటిఫికేషన్‌) రావడానికి ఐదారు నెలల సమయం ఉందని... శ్రీనివాస్‌ శ్రద్ధ పెట్టలేదు. నరేశ్‌ మాత్రం రాబోయే పోస్టులకు ఎదురయ్యే తీవ్రపోటీని వూహించాడు. నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా రాతపరీక్షకు సన్నద్ధత ప్రారంభించాడు. అదే స్ఫూర్తిని పరీక్ష రోజు వరకూ కొనసాగించాడు.

అందరూ ఆశ్చర్యపడే రీతిలో తొలి ప్రయత్నంలోనే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ అందుకున్నాడు. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత తయారవటం మొదలుపెట్టిన శ్రీనివాస్‌ మరో నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నాడు!
* * *
‘తోటివారు గాఢనిద్రలో ఉన్న రాత్రిళ్ళలో నువ్వు మాత్రమే మేల్కొని లక్ష్యం కోసం కృషి చేస్తుంటే- విజయం నీదే’ అని ఓ మహాశయుడు అన్నాడు. పోటీ పరీక్షల విషయంలో ఇది ముమ్మాటికీ సత్యం. ఏళ్ళ తరబడి చదివినవారంతా విజయం సాధించారని దీని అర్థం కాదు. కానీ విజేతలైనవారిలో ఎక్కువమంది మాత్రం మిగతావారికంటే ఒక మైలు ఎక్కువ నడిచినవారే.
 ముందే మేల్కొనడం: పోటీ పరీక్షల ప్రపంచంలో ముఖ్యంగా గ్రూప్స్‌ ఉద్యోగార్థులు ఎక్కువగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ కాలం గడిపేస్తారు. ప్రస్తుత సమాచారయుగంలో నోటిఫికేషన్ల సమాచారం కనీసం ఆర్నెల్ల ముందుగానే తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో ఇంతకంటే ముందే ఉద్యోగ ప్రకటనల విషయం అవగతమవుతోంది. అయినప్పటికీ అనేక రకాల వంకలతో చాలామంది సన్నద్ధతను ఆరంభించరు.
అసలు నోటిఫికేషన్‌ వస్తుందా? ఎన్నికలు దగ్గరలో లేవు కదా, ఇప్పుడు ఉద్యోగప్రకటనల అవసరం ఏముంది? ఇవన్నీ వట్టిగా వస్తున్న సమాచారమేనంటూ రంధ్రాన్వేషణ చేసి కాలహరణం చేసేస్తారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినా చదివి మంచి ప్రతిభ చూపితేనే కదా, ఎంపిక జాబితాలో ఉండేదన్న వాస్తవాన్ని ఒక్కసారీ గుర్తు చేసుకోరు.
ప్రణాళిక, వ్యూహం: ప్రభుత్వ ఉద్యోగం కోసం జరిగే పోటీపరీక్షలు రణరంగాన్ని తలపిస్తాయి. ప్రతిరోజూ ఒక సమరమే! నిజానికి యుద్ధరంగం కంటే ఇది మరింత భయంకరం. సమరాంగణంలో ప్రత్యర్థుల ఆయుధాలేమిటో తెలుస్తుంటాయి. జయాపజయాలను అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది.
కానీ పోటీపరీక్షల రంగంలో ఇది సాధ్యం కాదు. రాబోయే పరీక్ష అనే యుద్ధానికి ఎవరు ఏ విధమైన అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నారో అంచనా వేయలేం. అందుకే పటిష్ఠమైన సన్నద్ధతా ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుగా బరిలోకి దిగాలి. అందుకు ముందస్తు తయారీ దోహదపడుతుంది. ప్రణాళికతోపాటు అమలు చేసేవ్యూహం రూపొందించేందుకు కావలసినంత సమయం చేతిలో ఉంటుంది.
దీర్ఘకాలిక ప్రిపరేషనే మేలు: జాతీయ, రాష్ట్రస్థాయి పోటీపరీక్షల్లో ఉన్నత స్థానాలలో నిలిచిన ర్యాంకర్లు అందరిలో కనిపించే సారూప్యత- దీర్ఘకాల సన్నద్ధతే. స్వల్పసంఖ్యలో ఉండే పోస్టుల కోసం లక్షలమంది పోటీపడే పరీక్షల్లో విజయాన్ని నెలా నెలన్నర ప్రిపరేషన్‌తో ఆశించలేం. పోటీ తీవ్రత దృష్ట్యానే కాకుండా సిలబస్‌ల పరిధి రీత్యా కూడా ఎక్కువ సమయం అవసరం.
జాతీయస్థాయి పోటీపరీక్షలైన సివిల్‌ సర్వీసులకు నోటిఫికేషన్‌, రాతపరీక్ష దశలన్నీ నిర్దిష్ట కాలపరిమితిలో జరుగుతాయి. కాబట్టి ముందునుంచే ప్రణాళిక రూపొందించుకోవచ్చు. అయితే రాష్ట్రస్థాయి గ్రూప్స్‌ సర్వీసులకు సాధారణంగా నోటిఫికేషన్‌ అనంతరం అధిక వ్యవధి ఉండదు. ఈ తరహా పరీక్షలకు మాత్రం దీర్ఘకాలపు సన్నద్ధత తప్పనిసరి.
సిలబస్‌తో సాన్నిహిత్యం: ఆర్నెల్లు కలిసి తిరిగితే వారు వీరవుతారంటారు. ఏ పోటీపరీక్షయినా సిలబస్‌, ఆధారపడిన పుస్తకాలు, గత ప్రశ్నపత్రాలు... ఇవే ఆయుధాలు. సాధారణంగా అభ్యర్థి విద్యానేపథ్యానికీ, పోటీపరీక్షల సిలబస్‌కీ మధ్య అంతరం ఉంటుంది. సిలబస్‌పై అభ్యర్థి పట్టు సాధించనిదే ప్రిపరేషన్‌ పటిష్ఠం కాదు. సన్నద్ధతకూ, పరీక్ష గడువుకూ మధ్య వ్యవధి ఎంత ఎక్కువ ఉంటే సిలబస్‌తో సాన్నిహిత్యం అంత అధికంగా సాధ్యపడుతుంది.
సిలబస్‌ను ఆకళింపు చేసుకోవడం, గత ప్రశ్నపత్రాలను లోతుగా అర్థం చేసుకోవడం, అనుసరించే పుస్తకాలను నిశితంగా అధ్యయనం చేయడం వంటి సౌలభ్యాలు ప్రిపరేషన్‌ ముందస్తుగా ప్రారంభమైతేనే సాధ్యపడుతాయి.
అనుకోని అవాంతరాలు: బాగా ముందుగా సన్నద్ధత ప్రారంభిస్తే సిలబస్‌ అధ్యయనం సహజంగానే అందరికంటే ముందే ముగుస్తుంది. దీనివల్ల పునశ్చరణ (రివిజన్‌), స్వీయపరీక్ష (సెల్ఫ్‌ టెస్ట్‌), సందేహాల నివృత్తికి తగిన సమయం ఉంటుంది. అదేనోటిఫికేషన్లు వెలువడిన తర్వాత చేసే ప్రిపరేషన్‌ విషయంలో ఈ అవకాశం ఉండదు. ఒక విడత సిలబస్‌ను పూర్తిచేసేందుకే సమయం సరిపోవటం లేదని అభ్యర్థులు ఫిర్యాదు చేస్తుంటారు.
ముందస్తు సన్నద్ధత వల్ల దీనితో పాటు మరో సౌలభ్యం ఉంది. కుటుంబపరంగా కొన్ని బాధ్యతల నుంచి దూరంగా వెళ్ళలేని పరిస్థితులైన కుటుంబంలో పెళ్లి, ఆత్మీయుల అనారోగ్యం లాంటివాటికి సమయం కేటాయించినా సన్నద్ధతలో పటుత్వం సడలదు.
సవాళ్ళను అధిగమించేదెలా?
దీర్ఘకాల సన్నద్ధతలో నిమగ్నమయ్యే అభ్యర్థులకు కొన్ని సవాళ్ళు ఎదురవుతుంటాయి. ప్రిపరేషన్‌ను సమర్థంగా కొనసాగిస్తూనే ఈ సవాళ్ళను అధిగమించగలగాలి. ఇది కూడా పోటీ పరీక్షల ప్రస్థానంలో భాగమే!
సిలబస్‌ ఆసాంతం మారదు: లక్ష్యంగా నిర్దేశించుకున్న నోటిఫికేషన్‌ జాడ లేకుండా దీర్ఘకాల సన్నద్ధతలో నిమగ్నమైనపుడు ఒక సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఏడాదో, ఏడాదిన్నరో

సిద్ధమైన తర్వాత- తీరా నోటిఫికేషన్‌ రాగానే సిలబస్‌లో మార్పులు జరిగే సందర్భాలు ఉంటాయి. కొత్తగా మారిన సిలబస్‌ అందరికీ సమానమేననీ- ఎప్పటినుంచో తయారవుతున్నవారికి ఒనగూరే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదంటూ వాదనలు బయల్దేరతాయి. దీనికి నిరాశపడకూడదు. సరికదా సానుకూలంగా స్వీకరించాలి.
నిజానికి ఏ సిలబస్‌నూ ఆసాంతం మార్చరు, మార్చలేరు కూడా. నిశితంగా పరిశీలించి చూస్తే సిలబస్‌ మౌలిక స్వరూపంలో మార్పు ఉండదు. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగానో, ఎంపికైన తర్వాత పనిచేయబోయే పోస్టు బాధ్యతల్లో మార్పులు వచ్చినందునో సిలబస్‌ మార్పులూ, చేర్పులూ జరుగుతాయి. ముందునుంచీ చదివిన అభ్యర్థి ఈ మార్పులను ఆకళింపు చేసుకోవడం ద్వారా తన ప్రిపరేషన్‌ స్థాయిని కాపాడుకోవచ్చు. దీర్ఘకాల తయారీలో ఉన్న అభ్యర్థికి ఈ మార్పులు త్వరగా అర్థమవుతాయి.
ముందునుంచీ చదువుతున్న అభ్యర్థికి మరొక ప్రయోజనం కూడా ఉంటుంది. కొత్తగా సన్నద్ధత ఆరంభించే అభ్యర్థి పార్కింగులో ఉన్న విమానం లాంటివారైతే... ముందునుంచీ తయారీలో ఉన్న అభ్యర్థి రన్‌వేపై టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానంతో సమానం. ఏ సబ్జెక్టులోనైనా ప్రాథమిక అంశాలు మారవు కాబట్టి నోటిఫికేషన్‌ కంటే ముందు చేసిన సన్నద్ధత వృథా కాదు. పైగా స్వల్పకాలంలోనే ప్రిపరేషన్‌ వేగం పుంజుకుంటుంది.
ఉత్సాహపు పొంగుపై నీళ్ళు: కనుచూపు మేర నోటిఫికేషన్లు లేని సమయంలో ముందస్తు సన్నద్ధత ఆరంభించిన అభ్యర్థికి ఎదురయ్యే మరో సమస్య... దీర్ఘకాలంపాటు ఉత్తేజాన్ని నిలుపుకోవడం. పోటీ పరీక్షల సన్నద్ధతకు ఒక దశవరకూ ఇతరులపై ఆధారపడాల్సివుంటుంది. మెటీరియల్‌, పుస్తకాల సేకరణ, స్వీయ తర్ఫీదు లేదా అది కష్టం అనుకుంటే శిక్షణ కోసం కొంత వ్యయం తప్పనిసరి.
అభ్యర్థి సొంత ఇంటికి దూరంగా మరొక నగరంలో సిద్ధమవుతున్నట్టయితే బస, భోజన సౌకర్యాలకు నెలవారీ వ్యయం జరుగుతుంది. దీనికోసం తండ్రిపైనో, అన్నపైనో ఆధారపడాల్సివచ్చినపుడు నోటిఫికేషన్లు ఎప్పుడో స్పష్టత లేనప్పుడు ఇప్పటినుంచే ఖర్చు ఎందుకన్న జవాబు చెప్పి నచ్చచెప్పుకోవాల్సివుంటుంది.
ఇక స్నేహితులు, అంతగా అవగాహన లేని పరిచయస్థులు అభ్యర్థి ఉత్సాహపు పొంగుపై నీళ్ళు పోస్తుంటారు. ప్రైవేటు ఉద్యోగాలను వదిలేసి దీర్ఘకాల సన్నద్ధతకు కూర్చున్నవారి విషయంలో ఈ ఒత్తిడి ఎక్కువ. ఇన్ని ప్రతికూలతల మధ్య చదివేటప్పుడు ఏకాగ్రత అంతగా కుదరకపోవచ్చు. లేదా అభ్యర్థికి పట్టుదల సడలి తనమీద తనకే అపనమ్మకం ఏర్పడవచ్చు.
ఇటువంటి స్థితిలో అభ్యర్థిని నిరుత్సాహం, నిరాశ ఆవరించకుండా ‘విజువలైజేషన్‌ టెక్నిక్‌’ ఉపకరిస్తుంది. విజువలైజేషన్‌ అంటే తాను ఆశిస్తున్న పోస్టును సాధించినట్టు, అందరూ తనను అభినందిస్తున్నట్టు... తన ఇంటర్వ్యూలు టాపర్స్‌ శీర్షికలో పత్రికల్లో ప్రచురితమైనట్టు వూహించుకోవడం. దీనివల్ల ఎక్కడ లేని ఉత్సాహమూ వస్తుంది.
* గత టాపర్ల ఇంటర్వ్యూలను సేకరించి అప్పుడప్పుడూ తిరిగి చదువుతుండటం కూడా స్ఫూర్తిని కల్గిస్తుంటుంది.
* ప్రేరణను కలిగించే సూక్తులను స్టడీటేబుల్‌ వద్ద ఉంచుకుని తరచూ చూస్తుండాలి.
* సానుకూల దృక్పథం ఉన్నవారిని సహచరులుగా ఉంచుకుంటూ విరామ సమయంలో వారితో గడుపుతుండాలి. ఇది నిరాశా నిస్తేజాలకు దూరంగా ఉండేలా చేస్తుంది.

ముందస్తు... విజయోస్తు
ఎందరికో సుందర స్వప్నంగా కన్పించే పోటీపరీక్షలను పరిశీలిస్తే... నాలుగు దశలు ద్యోతకమవుతాయి.
 1 సుషుప్త దశ: పోటీ పరీక్ష గురించి ఏ అలజడీ లేని సమయం ఇది. అసలు ఫలానా తరహా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వస్తుందని గానీ... తర్ఫీదుకు సమయం ఆసన్నమైందని కానీ ఏ విధమైన సంకేతాలుండవు. ఒకవిధంగా నిర్దిష్ట పోటీపరీక్షకు సంబంధించి ఇది నిద్రాణమైన స్థితి. ఈ సమయంలో ఫలానా పోటీపరీక్షకు ప్రిపేరవుతున్నానని మిత్రులతో అంటే హేళన చేస్తారు కూడా. కానీ ముందస్తు సన్నద్ధతకు ఇలాంటి సమయంలోనే బీజం పడాలి. మిగతా దశలకు ఇదే పునాది.
 2 చైతన్యపూరిత దశ: ఈ దశలో ఇంకా నోటిఫికేషన్‌ వెలువడదు కానీ, ఆ సమాచారం బయటకు పొక్కుతుంది. అందరూ ఆ పోస్టుల గురించే మాట్లాడుకుంటుంటారు. మీడియాలో తరచూ వార్తలు వస్తుంటాయి. నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందా రాదా? వాయిదా పడుతుందా? ఎన్ని పోస్టులుంటాయి? వంటివాటిపై వూహాగానాలు వస్తుంటాయి. అప్పటివరకూ ముందస్తు సన్నద్ధతలో భాగంగా నిశ్శబ్దంగా చదువుకుంటున్న అభ్యర్థికి ఈ ‘రణగొణ ధ్వనులు’ విచిత్రంగా చెవులకు సోకుతుంటాయి. కాస్త ఆసక్తిదాయకంగానూ ఉంటుంది.
 3 కోలాహల దశ: అప్పటివరకూ ఆబాలగోపాలం చర్చించుకుంటున్న నోటిఫికేషన్‌ రానే వస్తుంది. ఎక్కడ చూసినా అదే కోలాహలం! ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునేందుకు నెట్‌ సెంటర్లు కిటకిటలాడుతుంటాయి. శిక్షణసంస్థల ప్రకటనలూ, తరగతులూ హోరెత్తిస్తుంటాయి. బస్సెక్కినా, సినిమా క్యూలో నిలబడినా సదరు పోస్టులకు దరఖాస్తు చేసినవారే కన్పిస్తారు.
 4 నిష్క్రమణ దశ: సన్నద్ధత ఆరంభించిన నెలా రెండు నెలల తర్వాతి దశ. ఈ దశలో సిలబస్‌ లోతు, పరిధి, ప్రశ్నల సరళి, పరీక్షకు మిగిలివున్న సమయం, అభ్యర్థికి తన శక్తిసామర్థ్యాలు అర్థమవుతాయి. దీనికి తోడు పోటీ తీవ్రత కూడా వెల్లడవుతుంటుంది. ఈ ప్రభావం చాలామంది అభ్యర్థులపై పడుతుంది. ఏదో ఒక సాకు చూపుతూ సన్నద్ధత నుంచి తప్పుకుంటారు.
ఈ దశలన్నిటిలోనూ ముందస్తుగా సన్నద్ధత ప్రారంభించిన అభ్యర్థి మనోబలం ఏమాత్రం చెక్కుచెదరకుండా ప్రస్థానం సాగిస్తుండాలి. అప్పుడే ఆ ప్రిపరేషన్‌ తిరుగులేనివిధంగా ఫలిస్తుంది!

No comments:

Post a Comment